వరంగల్‍ అర్బన్‍, రూరల్‍ జిల్లాలను హన్మకొండ, వరంగల్‍ జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‍ రిలీజ్‍ చేసింది. అర్బన్‍, రూరల్‍ జిల్లాల పేర్లు మారుతాయని ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నా గత నెల సీఎం కేసీఆర్‍ వరంగల్‍ సిటీ పర్యటనలో దీనిపై క్లారిటీ వచ్చింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాన్ని వరంగల్‍ అర్బన్‍, వరంగల్‍ రూరల్‍ పేర్లతో పిలవడం బాగాలేదని, వాటి పేర్లను హన్మకొండ, వరంగల్‍ జిల్లాలుగా మారుస్తూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు కేసీఆర్‍ చెప్పారు. జిల్లాల పేర్ల మార్పిడితో పాటు పలు మండలాలు ఒక డిస్ట్రిక్ట్​ నుంచి మరో డిస్ట్రిక్ట్​లోకి మారుస్తున్నట్టు నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. ఇన్నాళ్లు సిటీ మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉండగా ఇప్పుడు రెండు ముక్కలుగా విడదీసి ఒక భాగం హన్మకొండలో, మరో భాగం వరంగల్​ జిల్లాలో కలపనున్నారు. మండలాలు మారుతున్నయ్​ మొదట్లో కేవలం జిల్లాల పేర్లు మారుస్తారని పబ్లిక్​ భావించారు. దానికి భిన్నంగా ప్రభుత్వం పలు మండలాలను అటు, ఇటు మార్చబోతోంది. వరంగల్ ​అర్బన్‍ లో11 మండలాలు ఉండగా ఇంకో మండలం కలిపి 12 మండలాలు, 139 గ్రామ పంచాయతీలతో హన్మకొండ జిల్లాగా మారనుంది. రూరల్​ జిల్లా 16 మండలాలతో ఉండగా ఒకటి తగ్గి 15 మండలాలు 217 జీపీలతో వరంగల్‍ జిల్లాగా మారనుంది. రూరల్‍ జిల్లాలోని పరకాల, నడికుడ, దామెర మండలాలు హన్మకొండ జిల్లాలో కలుస్తుండగా అర్బన్‍లో ఉన్న వరంగల్‍, ఖిలా వరంగల్ ​మండలాలు, వరంగల్​జిల్లాలోకి వెళ్లనున్నాయి.

అన్ని రెండుగా విడిపోవాల్సిందే:

వరంగల్‍, హన్మకొండ, కాజీపేట కలిసి ట్రైసిటీ. జిల్లాల పేర్ల మార్పు సాకుతో మండలాలను అటు ఇటు మార్పుతున్న నేపథ్యంలో ఇన్నాళ్లు ఒకటిగా ఉన్న వరంగల్​ సిటీ ఇప్పుడు రెండు ముక్కలు కాబోతుంది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్​ ప్రకారం చూస్తే సిటీ పరిధిలోని హన్మకొండ, కాజీపేట ఒక జిల్లాలో వరంగల్‍, ఖిలా వరంగల్‍ మరో జిల్లాలో కలుస్తాయి. ఈ లెక్కన ఎంతో ఇంపార్టెన్స్​ ఉన్న సిటీ రెండుగా విడిపోవాల్సి ఉంటుంది. బస్‍స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, గుళ్లు గోపురాలు, పార్కులు, కట్టడాలు ఇలా అన్ని రెండుగా విడిపోవాల్సి ఉంది. GWMC రెండు జిల్లాల పరిధిలో ఉంటుంది. పబ్లిక్‍ సలహాలు, సూచనలు వరంగల్​ అర్బన్‍, రూరల్ ​జిల్లాలను హన్మకొండ, వరంగల్‍ జిల్లాలుగా మారుస్తూ రిలీజ్​ చేసిన నోటిఫికేషన్​లోని అంశాల మీద పబ్లిక్​ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ సీఎస్​ సోమేశ్​కుమార్‍ సూచించారు. ఈ జిల్లాల పరిధిలో ఉండే జనాలు 30 రోజుల్లోగా తెలుగు, ఇంగ్లీష్‍, ఉర్దూ భాషల్లో కలెక్టర్లకు లెటర్ల ద్వారా అభిప్రాయాలు తెలిపితే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. జిల్లాలు, మండలాల మార్పు విషయమై ఇచ్చిన నోటిఫికేషన్​ సమాచారం ప్రతి ఒక్కరికి తెలిసేలా రెండు జిల్లాల కలెక్టర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని అందులో పేర్కొన్నారు.