నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

ఈ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. దీంతో తాజా డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారని, అందువల్ల దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని తీహార్ అధికారుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానాన్ని కోరారు.

అయితే క్షమాభిక్ష పిటిషన్‌ కొట్టివేత గురించి దోషి ముఖేశ్‌కు సమాచారమిచ్చేందుకు కోర్టు జైలు అధికారులకు సాయంత్రం 4.30 గంటల వరకు సమయమిచ్చింది. దీంతో అధికారులు ముఖేశ్‌కు అధికారికంగా సమాచారమిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.