భర్త కంటే ముందు, భర్త కళ్ళ ముందే సుమంగళిగా చనిపోవాలని ఓ భార్య చేసిన దీక్ష. పుణ్యస్త్రీగా చనిపోవాలని నిర్ణయించుకుని నిరాహార దీక్ష చేపట్టి ఎట్టకేలకు తన కోరిక నెరవేర్చుకుంది. గుంటూరు జిల్లా గోవాడకు చెందిన కోదండ రామశర్మ వేణుగోపాలస్వామి దేవాలయంలో పూజారి. ఆయన భార్య అంజనాదేవి. రామశర్మకు 85, ఆమెకు 82 ఏళ్ళు.

భర్త అనారోగ్యంతో మంచం పట్టి చావుకు దగ్గరవుతున్నాడని తెలుసుకుంది. డాక్టర్లు కూడా ఆయన కొద్ది రోజుల్లో చనిపోతాడని చెప్పేశారు. కార్తీకమాసంలో తాను పుణ్యస్త్రీగానే చనిపోవాలని ఆమె భావించింది. భర్త కళ్ళ ఎదుటే తనువు చాలించాలనే ఉద్దేశ్యంతో గత 20 రోజులుగా ఆమె ఆహారం తీసుకోకుండా ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆమె తనను ఇంటికి తీసుకుపొమ్మని కొడుకు, కోడలిని కోరడంతో మూడురోజుల క్రితం ఇంటికి తీసుకెళ్ళారు. రెండు రోజుల క్రితం భర్త కోదండ రామశర్మ కోమా లోకి వెళ్ళిపోయారు. శనివారం ఉదయం అంజనాదేవి చనిపోయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే కోదండరామశర్మ కూడా ప్రాణం విడిచాడు. తన దీక్షతో సుమంగళిగా వెళ్ళిపోయిందా ఇల్లాలు. ఈ పుణ్య దంపతులిద్దరికీ కుటుంబ సభ్యులు, బంధువులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.