ఇద్దరు యువతుల ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన విషయం విదితమే. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఘటనా స్థలిలలో ఓ పాప మృతదేహం కూడా లభ్యమైంది. అయితే అసలేం జరిగింది ? ఈ ఘటన జరగడానికి కారణాలేంటి ? అనే వివరాలను ఏసీపీ శివకుమార్ మీడియాకు వెల్లడించారు.

యువతుల ఆత్మహత్య వెనుక:

‘ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువతులు సుమతి, రేవతిగా గుర్తించాం. సుమతి, రేవతి ఇద్దరూ ఫ్రెండ్స్, రేషన్‌ బియ్యం కోసం వెళ్లి ఇంటికి ఆలస్యంగా రావడంతో భర్తలు మందలించారు. మనస్తాపం చెంది రెండు రోజుల కిందట జవహర్‌నగర్‌కు వచ్చేశారు. రెండు రోజులుగా చర్చిలోనే ఉన్నారు, రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు.

సుమతికి కూతురు ఉంది పేరు ఉమామహేశ్వరి. చిన్నారికి కూల్‌డ్రింక్‌లో హార్పిక్‌, ఆలౌట్‌ కలిపి తాగించారు. చిన్నారి చనిపోయాక, ఇద్దరూ చున్నీలతో చెట్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు’ అని శివకుమార్ మీడియాకు వివరించారు. కాగా, పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాలను గాంధీ మార్చురీకి ఆస్పత్రికి పోలీసులు తరలించారు.