ఇల్లాలని పుట్టింట్లో వదిలి ప్రియురాలితో టూర్లు వేయడంతో పాటు పైగా ఆ ఫోటోలను తన భార్యకు పంపించాడు. ఆ ఫొటోలు చూసిన ఆ ఇల్లాలు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని హోణ్ణూరు కదిరెనహళ్లిలో నివసించే మునిరాజు, దేవమ్మల కూతురు మోనికకు, చిక్కబళ్లాపురంలో నివసించే భార్గవ్‌కు 8 నెలల క్రితం ఘనంగా వివాహం చేశారు. మోనిక, భార్గవ్‌లు అన్యోన్యంగానే ఉండేవారు. దసరాకు భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. అనంతరం మళ్లీ ఆమెను తీసుకెళ్లడానికి రాలేదు. తన భర్త వస్తాడని, వచ్చి తీసుకెళ్తాడని మోనిక ఎదురు చూసింది. కానీ అతడు రాలేదు. ఫోన్‌ చేసి నన్ను తీసుకెళ్లు అని భర్త భార్గవ్‌ను అడిగితే అతడు పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇదిలా ఉండగా మరో యువతితో షికార్లు చేస్తున్న ఫోటోను బుధవారం అతడు భార్య మోనికకు పంపించాడు. ఆ ఫోటోలు చూసిన ఆమె తీవ్ర ఆవేదన చెందింది. తన భర్త చేసిన పనికి తీవ్ర కలత చెందిన మోనిక ఇంటిపై ఉన్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త భార్గవ్ కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమ కూతురి జీవితాన్ని నాశనం చేసిన భార్గవ్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.