తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటల రాజేందర్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఊగిసలాడే పరిస్థితి ఉంది. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ఆయనకు ప్రగతి భవన్‌తో దూరం పెరుగుతోంది ఇలాంటి సమయంలో ఆయనకు మద్దతుగా ఇతర పార్టీలనేతలు మాట్లాడుతూ, ఆయనకు మరింతచిక్కులు తెచ్చి పెడుతున్నారు. గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాపం ఈటల అంటూ ఆయనపై సానుభూతి కురిపించేవారు. ఇప్పుడు ఆయనకు తోడుగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ జాబితాలో చేరారు. ఈటల రాజేందర్ ను సొంత పార్టీ వైపు ప్రోత్సహిస్తూ మాటలు మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్ పార్టీ పెడితే గొప్ప నాయకుడు అవుతారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా జోస్యం చెప్పారు. ఆయన గొప్ప నాయకుడని ఇలా సర్టిఫికెట్ ఇచ్చేశారు. టీఆర్ఎస్ ద్వారానే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్‌లతో సరిపడలేదు.

అందుకే ఆయన గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అచేతనంగా ఉండటం కేసీఆర్, కేటీఆర్‌లపై పోరాడాలన్న ఆయన సంకల్పం నేర వేరకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు. బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే మూడు నెలలతర్వాతనే నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. ఈ లోపు బండి సంజయ్‌తో భేటీ అయ్యేందుకు రంగంసిద్ధం చేసుకుంటున్నారు. ఈ లోపే టీఆర్ఎస్‌పై మైండ్ గేమ్ ప్రారంభించారు. తాను మళ్లీ టీఆర్ఎస్‌లోకి వస్తానని అయితే కేసీఆర్, కేటీఆర్‌ను పక్కన పెట్టి హరీష్ లేదా ఈటలకు పార్టీ బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రమే వస్తానని ఆయన చెబుతున్నారు. అది ఎలాగూ సాధ్యం కాదు. కానీ వారి పార్టీలో హరీష్, ఈటలపై కాస్తంత అనుమానం పెంచేలా ఆయన మాటాలున్నాయి. ఇదో రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. బీజేపీలో చేరకుండానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌పై బీజేపీ మార్క్ మైండ్ గేమ్ ప్రారంభించారని అనుకోవచ్చు.