జింక్‌ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో జూలై 25న లభించిన టీఏఎస్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ సూపర్‌వైజర్‌ సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న తల్లి, కుమారుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కుమారుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి క్రైం డీసీపీ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం: టీఏఎస్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్ మింది గ్రామం ఎస్సీ కాలనీలో నివసించేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న యడ్ల ఈశ్వరమ్మతో పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ దగ్గర శంకర్‌ రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. మొత్తంగా చీటీలకు చెల్లించాల్సిన సొమ్ముతో కలిపి రూ.7లక్షల వరకు బాకీ పడ్డాడు. అయితే ఈశ్వరమ్మతో వివాహేతర సంబంధం కారణంగా బాకీ తీర్చకుండా జాప్యం చేశాడు. విషయం తెలుసుకున్న ఈశ్వరమ్మ పెద్ద కుమారుడు యడ్ల గౌరీ శంకర్, చిన్న కుమారుడు (బాలుడు) డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడగడంతో ఇవ్వను అని శంకర్‌ చెప్పేశాడు.

అక్కడితో ఆగకుండా ఈశ్వరమ్మతో తనకు వివాహేతర బంధం ఉందని కించపరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ తిట్టడంతో ఆమె కుమారులు తట్టుకోలేకపోయారు. శంకర్‌ను హతమార్చాలని నిర్ణయించుకుని ప్రణాళిక ప్రకారం మాట్లాడాలని జూలై 25న తమ ఇంటికి పిలిచారు. తాగిన మైకంలో ఉన్న శంకర్‌ గొంతు, చేతి మణికట్టుపై కోసి ఈశ్వరమ్మ, గౌరీ శంకర్, అతని తమ్ముడు కడతేర్చారు. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్‌ మీద తీసుకెళ్లి జింక్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న పొదల్లో పడేశారు.

అర్ధరాత్రి ఇల్లు కడగడంతో దొరికేశారు:

జింక్‌ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో శంకర్‌ మృతదేహం జూలై 26న కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు అతని సహచర ఉద్యోగి, మల్కాపురం గాంధీజీ వీధికి చెందిన పాండా జితేంద్ర మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తమ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసే సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్‌ జూలై 25న విధులకు హాజరుకాలేదని, మరుసటి రోజు జింక్‌ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో చనిపోయి కనిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో క్రైం ఏడీసీపీ డి.గంగాధరం పర్యవేక్షణలో గాజువాక సీఐ భాస్కరరావు, ఎస్‌ఐ కె.సతీష్‌ బృందం దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మింది గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులను విచారించగా యడ్ల ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులతో శంకర్‌ గొడవపడ్డాడని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల వారితో మాట్లాడగా జూలై 25న అర్ధరాత్రి ఈశ్వరమ్మ ఇల్లు కడిగిందని స్థానికులు చెప్పారు. ఆ విషయం ఆధారంగా విచారించగా తామే శంకర్‌ను హతమార్చామని, రక్తపు మరకలను కడిగేశామని నిందితులు అంగీకరించారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ గంగాధరం, శ్రావణ్‌కుమార్, సీఐ ఎల్‌.భాస్కర్‌రావు, ఎస్‌ఐ కె.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.