చిత్రదుర్గ: ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది యువత కల ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగ భద్రత ఉంటుందని సమాజంలో గౌరవంతో పాటు జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుందని ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఓ యువతి 22 ఏళ్లకే సొంతం చేసుకుంది. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచింది. అమ్మాయికి ఉద్యోగం కూడా రావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఓ యువకుడితో ఆమెకు పెద్దలు నెల క్రితం నిశ్చితార్థం కూడా జరిపించారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా ఇంతలో ఏమైందో తెలియదు ఆ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకా రెకళ్లగెరె గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే: గ్రామానికి చెందిన మానస అనే యువతి 22 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది చల్లకెరె తాలూకాలోని నగరన్‌గెరె గ్రామంలో ఉన్న పోస్టాఫీసులో పోస్ట్‌మాస్టర్‌గా ఆమె పనిచేస్తోంది.

ఆమెకు నెల క్రితమే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడితో నిశ్చితార్థమైంది. కారణమేంటో తెలియదు గానీ మానస కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపంతో బాధపడుతూ కనిపించిందని ఏమైందంటే చెప్పేది కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. తనపై తానే చిరాకు పడుతూ ఉండేదని చెప్పారు. ఈ క్రమంలోనే మానస క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పటికే యాసిడ్ శరీరం లోపలి భాగాలను కొరుక్కుతినేయడంతో ఆమెను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. చిత్రదుర్గ ఎస్పీ జి.రాధిక ఈ ఘటనపై స్పందిస్తూ మానస కుటుంబ సభ్యులతో మాట్లాడామని కొద్దిరోజులు ఆమె మానసిక స్థితి సరిగాలేకపోవడంతో ఆమె మానసిక వైద్యశాలలో కూడా చికిత్స తీసుకున్నట్లు తెలిసిందని ఆమె చెప్పారు. మానసికంగా మానస తీవ్రంగా కుంగిపోయిందని మనస్తాపానికి గురయిందని ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్పీ రాధిక తెలిపారు.