నిన్నటి వరకు బాణసంచా పరిశ్రమలో తండ్రితో కలిసి చేదోడు వాదోడుగా ఉన్న కార్మికురాలు, మరికొన్ని రోజుల్లో గ్రూప్‌–1 అధికారి కాబోతున్నారు. గ్రూప్‌–1 ఫలితాల్లో ఆ కార్మికురాలు రాష్ట్రంలోనే టాప్‌–4 స్థానంలో నిలవడం విశేషం. విరుదునగర్‌ జిల్లా తిరుకులై గ్రామానికి చెందిన గురుస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె మహాలక్ష్మి.

ఈ కుటుంబం కడు పేదరికంలో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు బాణసంచా పరిశ్రమలో కూలీలు. బాణసంచా తయారీ పరిశ్రమలో పీస్‌ రేటుకు ఇచ్చే వేతనమే ఆ కుటుంబానికి పోషణ. అయినా, ఆ కుటుంబంలోని మహాలక్ష్మి చదువుల తల్లి సరస్వతిగా మారింది. పట్టువదలకుండా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకుంది. అంతే కాదు, తల్లిదండ్రులతో కలిసి బాణసంచా తయారీలో కార్మికు రాలిగా కూడా పనిచేసింది.

ఇప్పుడు ఆమె పడ్డ శ్రమకు, నేర్చుకున్న విద్యకు తగిన ఫలితం తగ్గింది. గ్రూప్‌ –1లో ఆమె టాప్‌ –4 స్థానాన్ని దక్కించుకున్నారు. తనకు ర్యాంకు రావడంతో మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం లక్ష్యంగా ఇప్పటికే రెండు సార్లు తాను టీఎన్‌పీఎస్సీ పరీక్షలు రాయడం జరిగిందని, ఇది మూడోసారిగా పేర్కొన్నారు. చదివించేందుకు తన తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యారు.