ఆయన రైల్వే శాఖ రిటైర్డ్ ఉద్యోగి, వయసు 62ఏళ్ళు కొన్నేళ్ల క్రితం కూతురికి పెళ్లి చేశాడు. ఆమె ఓ పిల్లాడు పుట్టాక భర్తతో విభేదాలు తలెత్తి విడాకులిచ్చింది. అప్పటి నుంచి కొడుకుతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కానీ ఆస్తి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుని కన్న తండ్రినే పొట్టనపెట్టుకుంది. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: హుగ్లీలోని ఉత్తరపర ప్రాంతానికి చెందిన కాళిదాస్ రైల్వే శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య చనిపోయింది. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు కేయా వయసు 45 ఏళ్లు పైగానే ఉంటుంది. ఆమెకు పెళ్లీడు రాగానే కాళిదాస్ ఓ సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఆమె పెళ్లయిన కొన్నాళ్లు భర్తతో అన్యోన్యంగానే ఉంది. ఓ బాబు పుట్టాడు. పిల్లాడు పుట్టిన కొన్నేళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలొచ్చాయి. కొన్నిసార్లు పెద్దలు ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించారు.

కానీ, భార్యాభర్తలిద్దరూ గొడవలు పడి ఇక ఇద్దరం కలిసి కొనసాగలేమని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కొడుకు అభిషేక్‌తో కలిసి కేయా తన పుట్టింట్లో తండ్రితో పాటే కలిసి ఉంటోంది. భర్తతో తెగతెంపులు చేసుకున్న విషయంలో కూతురి వైఖరి పట్ల కాళిదాస్ అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయంలో తండ్రీకూతురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఇటీవల ఆస్తి విషయంలో కూడా తండ్రీకూతురు గొడవపడ్డారు. ఆస్తి తనకూ, తన కొడుకుకే దక్కాలని ఆమె పట్టుబట్టింది. కూతురికి ఆస్తి పంచే విషయంలో సుముఖంగా లేని కాళిదాస్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారినట్లు పెద్దదైంది. ఆ క్రమంలో క్షణికావేశంతో తండ్రిపై కోపంతో కాళిదాస్ కూతురు ఇటుక రాయితో తలపై కొట్టింది. దెబ్బ గట్టిగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై కాళిదాస్ కుప్పకూలిపోయాడు. కొంతసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.