వనదేవతల సన్నిధి భక్తజన పెన్నిధిగా మారుతోంది. నిత్యం సందడిగా ఉంటుంది. ఒకప్పుడు రెండేళ్లకోసారి జరిగే జాతరకే వచ్చేవారు ఇప్పుడు పరిస్థితి మారింది. ఏడాది పొడవునా తరలొస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తీరొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఫలితంగా ఆదాయమూ పెరుగుతోంది. కేవలం 60 రోజుల్లో రూ.22.90 లక్షలు ఇందుకు నిదర్శనం. మేడారంలో హుండీ కానుకలను లెక్కించారు. మే 2న గద్దెలపై ఏర్పాటు చేసిన 20 హుండీల సీళ్లను తీసి అధికారులు, పూజారుల సమక్షంలో లెక్కించారు. సమ్మక్కదేవతకు రూ.12,71,588, సారలమ్మకు రూ.9,67,475, పగిడిద్దరాజుకు రూ.23,631, గోవిందరాజుకు రూ.27,654 లభించాయి.

నగదునంతా అమ్మవార్ల ఖాతాలో జమచేశారు. పెద్దనోట్ల లభ్యత తక్కువగా ఉండటం, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు మంది పేద, మధ్య తరగతి వారు ఎక్కువగా ఉండటంతో కానుల్లో కానుకల్లో చిల్లర నాణేలు- చిన్ననోట్లే ఎక్కువ ఉన్నాయి. రూ. 2వేల నోట్లు మొత్తం రూ. లక్షకు కొంచెం ఎక్కువగా, రూ.500 నోట్లు రూ.ఐదున్నర లక్షలు, రూ. 100 నోట్లు రూ.7లక్షల పైచిలుకు వచ్చాయి. ఇందులో మరో ఏడు లక్షల వరకు రూ.50, రూ. 20, రూ. 10 నోట్లే ఎక్కువ. చిల్లర నాణేలు రూ. లక్షకు పైగా లభించాయి. సిండికేట్‌బ్యాంకు మేనేజర్‌ వెంకటేష్‌, సిబ్బంది వెంకటయ్య, వీరేశం, రాము, పూజారులసంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నర్సింహులు, వీఆర్వో సమ్మయ్య తదితరులు లెక్కింపును పర్యవేక్షించారు.