కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిసింది. ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ (డీఏ)ను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి అంటే జులై నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఆశా వర్కర్లకు చెల్లించే గౌరవ వేతన మొత్తాన్ని కూడా పెంచినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు…

రూ.16 వేల అదనపు భారం:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మొత్తాన్ని అయిదు శాతం పెంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారికి కేంద్ర ప్రభుత్వం 12 శాతం డీఏను చెల్లిస్తోంది. దీన్ని 17 శాతానికి పెంచినట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్ దారులకు ఈ పెంపుదల వర్తిస్తుందని అన్నారు. డీఏను అయిదు శాతం పెంచాలంటూ తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానాపై 16,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని వివరించారు. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అయినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అదనపు భారాన్ని భరించడానికి ముందుకొచ్చామని అన్నారు.

ఆశా గౌరవ వేతనం రెట్టింపు:

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో విధి నిర్వహణలో ఉన్న ఆశా వర్కర్లకూ కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. వారికి చెల్లిస్తోన్న 1000 రూపాయల గౌరవ వేతనం మొత్తాన్ని రెట్టింపు చేసింది. దీన్ని 2000 రూపాయలకు పెంచినట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యతను ఆశా వర్కర్లు మోస్తున్నారని, వారి సేవలను తాము ఎప్పటికీ విస్మరించబోమని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా.. వారికి చెల్లించే గౌరవ వేతనాన్ని 1000 నుంచి 2000లకు పెంచినట్లు చెప్పారు.

ఆధార్ గడువు పెంపు:

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందుతున్న రైతులకు తాజాగా మరో వెసలుబాటు కల్పించినట్లు జవదేకర్ తెలిపారు ఈ పథకం కింద లబ్దిని పొందుతున్న రైతులు తమ ఆధార్ కార్డు నంబర్ ను అనుసంధానించుకోవడానికి ఉద్దేశించిన గడువును పెంచినట్లు చెప్పారు. ఆగస్టు 1వ తేదీ నాటికి ఆధార్ సీడింగ్ గడువు ముగిసిందని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ గడవును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఫలితంగా- రబీ సీజన్ లో రైతుల లబ్ది కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.