జైన సంప్రదాయం ప్రకారం ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన పాతికేళ్ల జైన్‌ మహిళ ఏక్తా అశుభాయ్‌ గల హఠాన్మరణానికి గురయ్యారు. ఏక్తా ఉపవాసదీక్ష కోసం గుజరాత్‌లోని కచ్‌లో నెల కిందట పుట్టింటికి చేరుకున్నారు. ఆగస్ట్‌ 27న వారం రోజుల పాటు సాగే ఉపవాసదీక్షను ఆమె చేపట్టారు. ఐదు రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆమెను పరీక్షించిన డాక్టర్‌ దీక్షను విరమించి రోజుకు ఒకసారైనా ఆహారం తీసుకోవాలని సూచించగా ఏక్తా నిరాకరించారు. సెప్టెంబర్‌ 3న ఏక్తా ఆరోగ్యం క్షీణించగా ఆమెకు గ్లూకోజ్‌ ఎక్కించారు. అప్పటికీ జైన విశ్వాసాల ప్రకారం ఆమె కేవలం బాయిల్డ్‌ వాటర్‌ను మాత్రమే సేవించేందుకు అంగీకరించారు. అదే రోజు రాత్రి ఆమె గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారని ఏక్తా బంధువులు వెల్లడించారు.