ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి కూతురు తన కాబోయే వరుడి కోసం ఎదురుచూస్తుంది. బాజా భజంత్రీలు అంత సిద్ధమయ్యాయి. ఇంకో గంటలో పెళ్లి ముహూర్తం. ఈ సమయంలో పెళ్లి కొడుకు చనిపోయాడనే వార్త ఆ కుటుంబాలలో విషాదం నింపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతుల కుమారుడు నరేష్ (25).

ఇతనికి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం కుదిరింది. 8వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందే వరుడు నరేష్ తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వరుడు ఆ నిద్రలోనే చనిపోయాడు. పడుకున్న వరుడు లేవకపోవడంతో మళ్లీ వైద్యుడ్ని పిలిచి పరీక్షించారు. కానీ అప్పటికే వరుడు చనిపోయాడని చెప్పడం తో ఆ తల్లిండ్రులు , బంధువులు విషాదంలో మునిగిపోయారు.