అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్నే భార్యే భర్తను చంపింది. ఈ ఘటన ఈ నెల 9 వ తేదీన కేసముద్రం మండలం తిమ్మంపేట గ్రామంలో జరిగింది. ఇద్దరు దోషులను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మేకల ఉప్పలయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి తిమ్మంపేట గ్రామంలో నివసిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా ఇదే ప్రాంతానికి చెందిన కాసోజు యాకంతచారితో ఉప్పలయ్య భార్యకు వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయం తెలిసి ఉప్పలయ్య భార్యను చాలా సార్లు మందలించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగా, ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు యాకంతచారితో కలిసి పథకం పన్నింది. ఈ నెల 9 న వ్యవసాయ పొలం వద్ద మరోసారి ఇద్దరు గొడవ పడ్డారు. ఇదే అదునుగా భర్తను కొట్టిన భార్య, ప్రియుడిని పిలిచి భర్త గొంతునులిమి చంపేసింది.

అనంతరం అక్కడే ఉన్న పొదల్లో పడేసి వెళ్లిపోయారు. మరుసటిరోజు తన భర్త కనిపించడం లేదంటూ హంగామా చేసిన సదరు మహిళ, పొలం వద్ద వెతుకుతూ పొదల్లో భర్త మృతదేహాన్ని చూసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఉప్పలయ్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపి ఉప్పలయ్య భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది. యాకంతచారితో కలిసి భర్తను చంపినట్లు ఉప్పలయ్య భార్య పోలీసుల ముందు నిర్ధారించింది. దాంతో వారిద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసులో త్వరగా నిందితులను పట్టుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, కేసముద్రం ఎస్‌ఐ సతీష్, హెచ్‌సీ రాఘవరావు, కానిస్టేబుళ్లు సంపత్, కుమారస్వామిలను డీఎస్పీ నరేష్‌ కుమార్‌ అభినందించారు.