వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న దుగ్ధతో పక్కా ప్లాన్ చేసి భర్తను హత్య చేయించిందో ఇల్లాలు. గత నెల 21న మహబూబాబాద్ జిల్లాలోని రేగడితండాలో జరిగిన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్-శాంతి భార్యా భర్తలు. శాంతి రెండున్నరేళ్లుగా వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

విషయం తెలిసిన నవీన్ భార్యను మందలించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి శాంతి పథకం వేసింది. అందులో భాగంగా గత నెల 21న రేగడి తండాలోని తన తల్లి ఇంటికి వెళ్లి మటన్ తీసుకురావాల్సిందిగా భర్తను పంపింది. భార్య పన్నాగం తెలియని నవీన్ స్కూటీపై రేగడి తండా బయలుదేరాడు. దారిలో కాపుకాసిన శాంతి ప్రియుడు వెంకటేశ్, అతడి స్నేహితుడు పద్దం నవీన్‌లు నవీన్‌పై దాడిచేసి, ఇనుప రాడ్డుతో తలపై మోది హత్య చేశారు.

అనంతరం రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు స్కూటీని అతడిపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు. నవీన్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి సేకరించిన మద్యం సీసాలపై ఉన్న బార్‌కోడ్, భార్య సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.