అధికారులు తనకు ఇవ్వాల్సిన పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ రైతు సజీవ సమాధి కావడానికి యత్నించిన ఘటన ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాలు: జిల్లాలోని నర్సింహులపేట మండలం రామన్నగూడేనికి చెందిన రైతు మేక ప్రభాకర్‌రెడ్డి తన సోదరుడు స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కై తనకు పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తనని తాను సజీవ సమాది చేసుకోబోయాడు. సోమవారం పెద్ద గొయ్యి తీసుకుని అందులో కూర్చుని తనపై మట్టివేసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అడ్డుకుని అతడిని బయటకు తీసుకొచ్చారు.

తమ కుటుంబానికి మొత్తం 15 ఎకరాల భూమి ఉండగా, అందులో ఐదెకరాలు తనవేనని ప్రభాకర్‌రెడ్డి తెలిపాడు. తన భూమికి రైతుబంధు నిధులు కూడా వస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే, ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపించాడు. తన తమ్ముడికి ఇచ్చి తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఆపమన్నారని అధికారులు చెప్పారని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.