ప్రపంచ ప్రఖ్యాత జోగ్‌ జలపాతం ఉరకలేస్తూ పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు జోగ్‌కు తరలివస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శరావతి నది జలకళను సంతరించుకోవడంతో జోగ్‌ జలపాత ప్రదేశంలో భారీ సందడి కనిపిస్తోంది. రాజా, రాణి, రోరర్‌, రాకెట్‌ జలపాతాలు భారీ శబ్దం చేస్తూ 960 అడుగుల ఎత్తు నుంచి కిందకు దుముకుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. శరావతి నదీ పూర్తిగా నిండిపోవడంతో జోగ్‌ జలపాత వైభవం కనువిందు చేస్తోంది. లింగనమక్కి రిజర్వాయర్‌ నిండిపోవడంతో శరావతి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. జోగ్‌ జలపాత ప్రదేశంలో హోటళ్ళన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.