వారిద్దరు ప్రభుత్వ అధికారులు, మంచి హోదాలో ఉన్నారు. కానీ వారి బుద్ధి పక్క దారి పట్టింది. తమ శాఖలో కింది స్థాయి మహిళ ఉద్యోగులపై కన్నేసిన అధికారులు, నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వెకిలి చేష్టలతో నరకం చూపిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

భూపాలపల్లి ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌ శశిధర్‌రెడ్డి.. కాటారం ఎక్సైజ్‌ మహిళ సీఐపై వేధింపులకు పాల్పడుతున్నాడు. కాటారంలో విధుల్లో చేరినప్పటి నుంచి మూడేళ్లుగా నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సూపరింటెండెంట్‌ వేధింపులను భరించలేని బాధితురాలు, భూపాలపల్లి కలెక్టర్‌, వరంగల్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. నా క్వార్టర్‌ పక్కనే నీకు క్వార్టర్‌ ఇప్పిస్తా, ఇక్కడే ఉంటూ డ్యూటీ చేయ్‌. అవసరమైతే భూపాలపల్లి ఇన్‌చార్జి సీఐ పోస్టు కూడా నీకే ఇప్పిస్తా అంటూ తనపై ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారని బాధితురాలు వాపోయింది.

అంతే కాదు రాత్రి వేళల్లో స్వయంగా పాట పాడి దానిని తన వాట్సాప్‌లో పెట్టే వారని, పనికి మాలిన పాటలను పోస్టు చేస్తూ రోజు వెకిలిచేష్టలకు దిగుతున్నారని ఆరోపించారు. అకారణంగా కానిస్టేబుల్‌ ముందు తిట్టడమే కాకుండా రాత్రివేళలో సరిహద్దు గ్రామాల్లో దాడులకు వెళ్లాలని ఆర్డర్‌ ఇస్తారని, తనను ఎందుకు వేధిస్తున్నారో అడిగి తెలుసుకునేందుకు జిల్లా కార్యాలయానికి వెళ్తే, తీవ్ర పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు.

అటు ఇదే జిల్లాలో మరో అధికారి వేధింపుల పర్వం కూడా సంచలనంగా మారింది. భూపాలపల్లి డీఎంహెచ్‌వో గోపాల్‌రావు వేధిస్తున్నారంటూ.. గణపురం మండలం చెల్పూరు పీహెచ్‌సీ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి విజిట్‌ సమయంలోనూ, ఫోన్‌లోనూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీంతో డీఎంహెచ్‌వో గోపాల్‌రావుపై గణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. 15 రోజుల పాటు విచారించిన పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయనకు అరెస్ట్ వారెంట్‌ జారీ చేశారు. శనివారం అతన్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. గోపాల్‌రావు గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.