అనకాపల్లిటౌన్: మండలంలోని కాపుశెట్టివాని పాలెంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు సబ్బవరపు కుమారస్వామి (36) మృతి చెందారు. అనకాపల్లి గ్రామీణ ఎస్‌ఐ CH.నర్సింగరావు తెలిపిన వివరాలు: కుమారస్వామి సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సబ్బవరం రహదారి ఇరువాడలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తీసుకుని వచ్చినట్టు ఎస్‌ఐ చెప్పారు. ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచి సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో అనకాపల్లి నుంచి సబ్బవరం స్టేషన్‌కు వెళుతుండగా కాపుశెట్టివాని పాలెంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన నిర్మించిన కాలువలో పడిపోయింది.
దీంతో కుమారస్వామి అక్కడిక్కడే మృతి చెందారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. మృతుడి భార్య హైమావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 2009 బ్యాచ్‌కు చెందిన కుమార స్వామి సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో 2012 వరకు పనిచేశారు. అనంతరం ఎస్. రాయవరంలో 18 నెలలు పాటు పనిచేసి, 8 నెలల క్రితం సబ్బవరంలో పోలీసు స్టేషన్‌కు బదిలీపై వచ్చారు.