లాక్ డౌన్ లో వలసజీవులు అష్టకష్టాలు పడుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి తిండి దొరక్క, ఉండటానికి గూడుకరువై లక్షలాది మంది బడుగు జీవులు నగరాల నుంచి కాలినడన గ్రామాల బాట పడుతున్నారు. తాజాగా వలస కార్మికులకు చెందిన హృదయ విదారక ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలో వెలుగు చూసింది.

నగరం నుంచి తన కుటుంబాన్ని సొంత ఊరికి చేర్చేందుకు వలస కార్మికుడు కాడెద్దులా మారి బండి లాగుతున్న దృశ్యం చూపరులను విస్మయానికి గురిచేసింది. రాహుల్‌ అనే వ్యక్తి ఇండోర్‌ లో కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడంతో తన రెండెడ్ల బండిపై 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరు మండ్లనయాతకు వెళ్లి పోవాలనుకున్నాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఒక ఎద్దును అమ్మేశాడు.

వచ్చిన డబ్బుని దగ్గర పెట్టుకుని భార్య, తమ్ముడిని బండిపై కూర్చొబెట్టి మరో ఎద్దుకు జతగా తానే కాడిని ఎత్తుకుని పయనం మొదలుపెట్టాడు. ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై బండిని లాగుతూ మీడియా కంటపడ్డాడు. సొంతూరు వెళ్లేందుకు తన ఎద్దును చాలా తక్కువ ధరకు అమ్మేశాని చెప్పాడు. తన తండ్రి, సోదరి కాలినడకన ముందే వెళ్లిపోయారని చెప్పాడు. రాహుల్‌ బండి లాగుతున్న వీడియో వైరల్‌ కావడంతో మధ్యప్రదేశ్‌ మంత్రి తులసీ సిలావత్‌ స్పందించారు. రాహుల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.