ఆర్టీసీ కార్మికుల సమ్మెతో స్కూళ్లకు దసరా సెలవులు పొడిగించడంపై సీఎం కార్యాలయానికి సామాన్యుల నుంచి ఫోన్లు వరుస పెడుతున్నాయి. బీదల కష్టాలు పట్టించుకోకుంటే ఎట్ల అంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. సీఎంవో లోని హెల్ప్ లైన్ కు కాల్ చేసి తమ గోడు చెప్పుకుంటున్నారు. ఇవాళ ఉదయం కరీంనగర్ చెందిన రంజిత్ అనే వ్యక్తి కేసీఆర్ తండ్రిలా వ్యవహరించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సిద్దిపేటకు చెందిన కరుణాకర్ (41) అనే మరో సామాన్యుడు ఫోన్ చేసి ‘తెలంగాణ బాపూజీ అవుతడని పూజలు చేసినం ఇప్పుడు ఆయనే ఇట్లజేస్తే ఎట్ల’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు•

పది పన్నెండు వేల జీతాలు సంపాదించుకునే తాము పిల్లల్ని రూ.50 వేల ఫీజు కట్టి ప్రైవేటు స్కూల్ లో చదివిస్తున్నామని, ఇప్పుడు స్కూళ్లు బంద్ పెడితే ఎట్ల అని ప్రశ్నించాడు కరుణాకర్. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏమైనా చేస్తదా లేదా అని నిలదీశాడు. 

కేసీఆర్ అంటే తమకు ప్రాణమని, టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఆయన వెనుకనే తిరిగామని, ఉద్యమంలో జైళ్లకు పోయామని చెప్పాడు కరుణాకర్. తెలంగాణకు మరో బాపూజీ అవుతాడని పూజించిన వ్యక్తి ఇప్పుడు ఇలా ప్రజల చావులు, ఆత్మహత్యలకు కారణమైతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు. 

రెండోసారి గెలిచినా ఇంకేముందిలే అనుకుంటే ఎలా అని నిలదీశాడు కరుణాకర్. మంత్రులు, ఎమ్మెల్యేలకు జీతాలు పెంచిన కేసీఆర్ కార్మికులను పిలిచి మట్లాడలేరా అని అడిగాడు. ఆయన పెద్దన్నలా, తండ్రిలా వ్యవహరించి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఇప్పటికైనా మంచి ఆలోచించి, అందరికీ మంచి జరిగేలా చూస్తారని ఆశిస్తున్నానని ఫోన్ కాల్ ముగించాడు కరుణాకర్.