భూపాలపల్లి: ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, అతడి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని రూపిరెడ్డిపల్లి సర్పంచ్‌ బండారి కవితా దేవేందర్‌ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త బండారి దేవేందర్‌ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నందునే ఎమ్మెల్యే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తరచూ మనోవేదనకు గురి చేస్తున్నారని హెచ్‌ఆర్సీకి తెలిపారు. ఈ నెల 2న మండలంలోని సర్పంచ్‌లు, నాయకులతో కలిసి తమ గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరామన్నారు. కుల ప్రస్తావన తెస్తూ మీ గ్రామానికి ఒక్క రూపాయి నిధులు కేటాయించను. సంఘాన్ని వదిలేయాలి’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారని వాపోయారు.

అందరి ముందు అవమానించడమే కాకుండా తరువాతి రోజు నుంచి తన అనుచరులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని హెచ్‌ఆర్సీ ఎదుట మొరపెట్టుకున్నారు. తనకు తన కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే, అతడి అనుచరులతో ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని హెచ్‌ఆర్సీని వేడుకున్నారు.