ఏజెన్సీ ప్రాంతంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు వెళ్లిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ను పోలీసులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన రేగళ్ల గ్రామంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే శనివారం ఉదయం బయలుదేరారు.

టేకులపల్లి మీదుగా వస్తున్న ఆమెను రేగళ్ల క్రాస్‌ రోడ్డు వద్ద లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ నిలువరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి అనుమతి లేదని చెప్పడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ విషయంపై సీఐ అశోక్‌ను వివరణ కోరగా, రేగళ్ల ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, పైగా నిత్యావసర వస్తువుల పంపిణీకి అనుమతి లేని కారణంగా రేగళ్లకు వెళ్లనీయలేదని తెలిపారు.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో గిరిజిన గ్రామాల్లోని ప్రజలకు సీతక్క నిత్యావసరాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం రోడ్డు మార్గం లేని గిరిజన గ్రామాలకు సైతం వెళుతూ, వారి ఆకలి తీరుస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘గో హంగర్‌ గో’ చాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె కాలికి చిన్నపాటి గాయం కూడా అయింది. అయితే ప్రస్తుతం పోలీసులు సీతక్కను అడ్డుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.