ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్కను మంగళవారం ములుగు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తలాపునే గోదావరి ఉన్న త్రాగటానికి నీళ్ళు లేవని ములుగు నియోజకవర్గం గుండా గోదావరి జలాలు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నారు తప్పా ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.

దీనికి నిరసనగా టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన జలదీక్షను అడ్డుకోవడం ముఖ్య మంత్రికి తగదని అక్రమ అరెస్ట్ తో మా దీక్షను అడ్డుకోలేరని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గోల్లపెల్లి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బనోతు రవి చందర్, తదితరులు పాల్గొన్నారు.