తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రగిరిలోని గంగుడుపల్లెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజు హత్యకు గురయ్యాడు. కారులో ఉన్న నాగరాజుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో అతను అక్కడే సజీవ దహనమయ్యాడు. అయితే, నాగరాజు హత్యకు తన తమ్ముడి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం: బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు తిరుపతి నుంచి వెళ్తుండగా గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైంది. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు, కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు, ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ సాయంతో విచారణ కొనసాగుతోంది.

అయితే, నాగరాజును సర్పంచ్‌ చాణిక్య హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా పంచాయితీ పేరుతో నాగరాజును సర్పంచ్‌ తీసుకెళ్లాడు. అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, నాగరాజు తమ్ముడు పురుషోత్తం అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సర్పంచ్‌ చాణిక్య సోదరుడు వితింజయ్‌ భార్యతో పురుషోత్తంకు అక్రమ సంబంధం ఉండటంతో దీనిపై ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ విషయమై శివరాత్రి రోజు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం పంచాయితీ పెట్టించినట్టు సమాచారం. అక్రమ సంబంధం కారణంగా రెండు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్‌ చాణిక్య తాజాగా నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు.

ఈ క్రమంలోనే మాటల సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్‌ చాణిక్య ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సర్పంచ్‌ చాణిక్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా బోరునవిలపిస్తున్నారు. ఈ సందర్బంగా నాగరాజు భార్య సులోచన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్తను గోపి, రుపేంజయ, చాణిక్య, సుబ్రహ్మణ్యం చంపేశారు. రాజీచేస్తామని పిలిచి కారుతో సహా కాల్చారు. నాకు న్యాయం చేయకపోతే వారిని కూడా చంపేస్తాం అని ఆవేదనలో సీరియస్‌ కామెంట్స్‌ చేశారు.