ఆపిల్ కొత్త ఐఫోన్లు భారత్‌లో అందుబాటులోకి రావడాని కంటే ముందే తాను కొనుగోలు చేయాలనుకున్నాడు. దీని కోసం దుబాయ్ వరకు వెళ్లాడు. భారత్‌లో ఈ ఫోన్లు లాంచ్ కావడానికి ఒక్క రోజు ముందే కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త కొత్త ఐఫోన్‌ను తన సొంతం చేసుకున్నారు. ఇప్పుడే కాదు ఈ వ్యాపారవేత్త ఇంతకు ముందు కూడా ఐఫోన్లు కొనేందుకు దుబాయ్ వెళ్లారు. దుబాయ్‌లో అత్యంత ఫేమస్ షాపింగ్ సెంటర్ అయిన మిర్డిఫ్ సిటీ సెంటర్‌ నుంచి ఐఫోన్‌ను ఈ వ్యాపారవేత్త కొన్నారు. ధీరజ్ పల్లియిల్ అనే వ్యాపారవేత్త దుబాయ్‌లోని అత్యంత పాపులర్ షాపింగ్ అడ్డా అయిన మిర్డిఫ్ సిటీ సెంటర్‌లో ఐఫోన్ 14 ప్రొను కొనుగోలు చేశారు. ఈ ఐఫోన్‌ను కొనేందుకు సిటీ సెంటర్‌లో వేచిచూసిన వందలాది మందిలో ఈయన ఒకరు. తొలి ఫోన్ ధీరజ్‌కే దక్కింది. ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర రూ.1,29,000గా ఉంది. అయితే ధీరజ్ ఈ ఫోన్‌ను కొనేందుకు ఇక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లేందుకు టిక్కెట్ ఖర్చులుగా రూ.40 వేలు అయింది. ధీరజ్‌కి వీసా ఫ్రీ ఉంది.

Advertisement

ఈ వ్యాపారవేత్త ఖరీదైన గాడ్జెట్లు కొనుగోలు చేసేందుకు విదేశాలకు వెళ్లడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు 2017లో కూడా ధీరజ్ ఐఫోన్ 8ను కొనుగోలు చేసేందుకు దుబాయ్ వెళ్లారు. అంతేకాక మరిన్ని ప్రదేశాలకు వెళ్లి కూడా అత్యంత ఖరీదైన గాడ్జెట్లను ధీరజ్ కొనుగోలు చేశారు. ‘‘2019లో దుబాయ్‌లో అమ్మకాలు ప్రారంభమైనప్పుడు నేను తొలుత ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ కొనేందుకు మిర్డిఫ్ సిటీ సెంటర్‌కు వెళ్లాను. భారత్‌లో ఆ మోడల్ లాంచ్ కావడాని కంటే కొన్ని వారాల ముందే ఆ ఫోన్ నా చేతులోకి వచ్చేసింది’’ అని ధీరజ్ చెప్పారు. ఐఫోన్ 12, ఐఫోన్ 13 కొనుగోలు చేసిన తొలి కస్టమర్ తానేనని అన్నారు. ధీరజ్ ప్రస్తుతం డిజిటల్ కన్సల్టెన్సీ డేర్ పిక్చర్స్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్2లను విడుదల చేసింది. భారత్‌లో ఐఫోన్ 14 128జీబీ ధర రూ.79,900కాగా.. 256జీబీ, 512జీబీ మోడల్స్ రేట్లు రూ.89,900గా, రూ.1,09,900గా ఉన్నాయి. అలాగే ఐఫోన్ 14 ప్రొ మోడల్ బేస్ వేరియంట్ ధర రూ.1,29,900గా ఉంది. 256జీబీ వేరియంట్ రూ.1,39,900గా, 512జీబీ వేరియంట్ కాస్ట్ రూ.1,59,900గా, 1టీజీ వేరియంట్ ధర రూ.1,79,900గా ఉన్నాయి. ఐఫోన్ ప్రొ మ్యాక్స్ ధరలను ఆపిల్ కంపెనీ రూ.1,39,900గా, రూ.1,49,900గా, రూ.1,69,900గా, రూ.1,89,900గా నిర్ణయించింది.