ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే బాగా శ్రమించినా పలువురికి నిరాశే ఎదురవుతుంది. బాగా సాధన చేసినా అందని ద్రాక్షలా మిగులుతుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు రాష్ట్ర ప్రభుత్వ, ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తున్నారు నిఖిలారెడ్డి. చిన్నతనం నుంచే చదువుల్లో రాణిస్తున్న ఈ విద్యాకుసుమం అంకితభావంతో ప్రభుత్వ ఉద్యోగాలు పొంది నిరుద్యోగ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శనివారం రాత్రి ప్రకటించిన కేంద్ర స్టాప్ సెలక్షన్ కమీషన్(ఎస్ఎస్సీ) పరీక్షలో ప్రతిభచాటారు.
సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాశెట్టి రవీందర్‌రెడ్డి, లక్ష్మిల కుమార్తె దాశెట్టి నిఖిలారెడ్డి ‘సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్’లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 2019 ఫిబ్రవరిలో కేడీసీసీ బ్యాంక్ పరీక్షలో క్లర్క్, సహాయ మేనేజర్‌గా ఉద్యోగాలు సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాన్ని సాధించారు.
ప్రస్తుతం కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ బ్రాంచిలో సహాయ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న క్రమంలోనే మూడు బహుళజాతి సంస్థల్లో సాప్ట్వేర్ ఇంజినీర్ అవకాశాలు ఉన్నా ప్రజా సేవ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఫలితం సాధించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లో ఉద్యోగాన్ని సాధించిన నిఖిలారెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు. నిఖిలారెడ్డి తండ్రి ధర్మారం మండలం దొంగతుర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు.