సాధారణంగా ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముళ్లు, తోడికోడళ్లు పోటీ చేయడం చూస్తుంటాం. అయితే తమిళనాడులోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సవతులు పోటీ చేయడమే గాక, ఇద్దరూ విజయం సాధించారు. దీంతో వారి భర్త ‘రెట్టింపు’ ఆనందంగా ఉప్పొంగిపోయారు.
తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఎం. ధనశేఖరన్‌ స్థానిక సహకార సంఘం రేషన్ దుకాణంలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీరు పోటీ చేయగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఇద్దరూ జయకేతనం ఎగురవేశారు. ధనశేఖరన్‌ మొదటి భార్య సెల్వీ వజూర్‌ అగ్రహారం పంచాయతీ నుంచి తిరిగి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లోనూ సెల్వీ ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు.

ఇక రెండో భార్య కాంచన.. కోయిల్‌ కుప్పమ్‌ పంచాయతీ నుంచి గెలుపొందారు. ధనశేఖరన్‌ భార్యలిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ధనశేఖరన్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్‌. తన భార్యలను గెలిపించిన పంచాయతీల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.