ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, మృతిచెందిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం: ప్రయాగ్‌రాజ్‌లోని సంగం నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి, దివ్యాంగురాలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే, గారాపూర్ నుంచి సికంద్రా వెళ్లే రోడ్డు పక్కన రాజ్‌కుమార్ యాదవ్(55) తన ఫ్యామిలీతో కలిసి నివాసిస్తున్నాడు. కాగా, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు శనివారం ఉదయం వారి ఇంట్లోకి ప్రవేశించి రాజ్‌కుమార్ యాదవ్, అతని భార్య కుసుమ్ దేవి(52), కోడలు సవిత(27), దివ్యాంగురాలైన కుమార్తె మనీషా(25), మనవరాలు మీనాక్షి(2)ని దారుణంగా హత్య చేశారు.

దుండగుల దాడి నుంచి యాదవ్‌ మనుమరాలు సాక్షి(5) తప్పించుకోగా యాదవ్‌ కుమారుడు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో సోదాలు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మనీషా బట్టలు చిందరవందరగా ఉండటంతో హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.