హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ లో ముస్లిం అమ్మాయిలు ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఇలాంటి దారుణం మరొకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఫర్హాన్ బేగం (26) అనే అమ్మాయి, తల్లిదండ్రుల దగ్గరికి ఇద్దరు ఏజెంట్లు వచ్చి ఒక మంచి సంబంధం ఉందని తెలియజేయడంతో, వారు ఏజెంట్ల మాటలు నమ్మి ఫర్హాన్ బేగంకు ఒమన్ దేశానికి చెందిన ఓ వ్యక్తితో, 2019 నవంబర్ 10వ తేదీన వివాహం జరిపించారు. అయితే పెండ్లి అయిన తర్వాత, వీసా కోసం యువతి చాలా రోజులు ఇక్కడే ఉంది. వీసా రావడంతో గత నెల 25వ తారీకు ఫర్హాన్ బేగం మస్కట్‌కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఫర్హాన్ బేగంకు తన భర్త ఒక మానసిక రోగి అని తెలిసింది.

అంతేకాకుండా ఆమెను ప్రతిరోజు, కుటుంబ సభ్యులు తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు. భర్త ఒక మానసిక రోగి కావడం వల్ల, ఆమె ఉద్యోగం చేయాలంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి చేయడమే కాకుండా, వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు. దీంతో ఫర్హాన్ బేగం అక్కడి పరిస్థితిని తన తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు భారతీయ విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్‌కి విజ్ఞప్తి చేశారు. తన కూతుర్ని రక్షించి, అక్కడినుండి ఇండియాకు తీసుకుని రావలసిందిగా కోరారు.