పదకొండేళ్ల నిరీక్షణ ఫలించనుంది. చారిత్రక ఓరుగల్లు నగరంలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. హంటర్‌రోడ్‌ జూపార్కు ఎదురుగా రీజినల్‌ సైన్సు కేంద్రం పక్కనే సుమారు 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. అక్టోబరు 5న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు దీనికి శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ వెల్లడించారు.

హైదరాబాద్‌లోని శిల్పారామం తరహాలో నగరంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా పర్యాటక శాఖ తగిన ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.20కోట్ల నిధులు కేటాయించేందుకు నిర్ణయించారు. హన్మకొండ ప్రాంతం సర్వేనంబరు 23, 26లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంటుందని గుర్తించారు. ఇందులోనే శిల్పారామం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

జూపార్కు, రీజినల్‌ సైన్సు కేంద్రం, భద్రకాళి బండ్‌ ఉన్నాయి. ఇదే ప్రాంతంలో శిల్పారామం ఉంటే బావుంటుందని పలువురి నుంచి సలహాలు, సూచనలు వచ్చాయి. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట త్రినగరాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందనుకున్నారు. రెండు, మూడు రోజుల్లో శిల్పారామం ఏర్పాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

2008 నుంచి పెండింగ్‌:

దాదాపుగా పదకొండేళ్లుగా స్థలం కోసం వెతుకుతున్నారు. గోపాల్‌పూర్‌, రాంపూర్‌, మడికొండ, ఖిలావరంగల్‌, హసన్‌పర్తి, మడిపల్లి, పైడిపల్లి, ఖిలావరంగల్‌, మామునూరు, బాలసముద్రం ప్రాంతాల్లో స్థలాలు గుర్తించారు. వివిధ కారణాలతోనే వాయిదా పడుతోంది. ఖిలావరంగల్‌ కోటలోనే శిల్పారామం బాగుంటుందని నిపుణుల నుంచి సలహాలు, సూచనలు వచ్చాయి. ఎట్టకేలకు హంటర్‌రోడ్‌ జూపార్కు ఎదురుగా స్థలాన్ని ఖరారు చేశారు…