ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని వర్గాలను కకావికలం చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకుంది. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 15 మందికి పైగా వైరస్ సోకింది. తాజాగా వరంగల్ నగర మేయర్ దంపతులు కూడా కరోనా బారిన పడ్డారు. గురువారం 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 36 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, భూపాలపల్లి జిల్లాలో 24, వరంగల్ రూరల్ జిల్లాలో 22, జనగామ జిల్లాలో 10, మహబూబాబాద్ జిల్లాలో 44, ములుగు జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఉమ్మడి జిల్లా ప్రజలను వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడంతో ప్రజలు ఇండ్లల్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వరంగల్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు తీసుకుని వెళ్లే కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల్లో పర్యవేక్షణ చేసే ఆఫీసర్లు, సిబ్బందికి సైతం కరోనా సోకుతోంది హన్మకొండలోని పోస్టల్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించగా గర్భిణీ కరోనా బారిన పడి చికిత్స పొందుతోంది. వరంగల్ నగరంలోని దేశాయిపేటలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకగా, ఒకరు చనిపోయారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో600ల‌కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 9మంది మరణించారు. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో జూన్ 10 వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కానీ జూన్ తర్వాత 220 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. జనగామలో హైదరాబాద్ నుంచి వచ్చిన వారితో వ్యాపారికి కరోనా సోకింది. అతడి కారణంగా 80 మందికి కరోనా అంటుకుంది. ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. తాజాగా పాలకుర్తిలో ఒకరు మరణించారు. మహబూబాబాద్ జిల్లాలో 91మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ముగ్గురు మరణించారు.