అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే విధంగా ఉంది ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో టిఆర్ఎస్ పరిస్థితి . జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం అధికార పార్టీలో కలకలం రేపుతూ ఉంది. పదవులు దక్కినవారు పండుగ చేసుకుంటుంటే పదవులు ఆశించి భంగపడిన వారు మాత్రం అసంతృప్తి సెగలు కక్కుతున్నారు . కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కూడా కమిటీల నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుడా ఛైర్మన్ పదవీ కాలం ముగిసినప్పట్నుంచి ఆశావహులు ఆ పీఠంపై కన్నేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కుడా ఛైర్మన్ పదవిని మళ్లీ మర్రి యాదవరెడ్డికే కట్టబెట్టారు.

దీంతో పదవి ఆశించిన వారంతా భంగపడ్డారు. మర్రి యాదవరెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించడంతో పాటు సభ్యులుగా ఐదుగురిని. అడ్వైజరీ మెంబర్ లుగా మరో 15 మందిని నియమిస్తూ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది . తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన వారిని పట్టించుకోలేదన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. స్థానికంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలే ఈ కమిటీ నియామకాల్లో చక్రం తిప్పారని అధికార పార్టీ నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. కుడా ఛైర్మన్ పదవిపై పార్టీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకోగా ఇతర పదవుల పంపకాల్లో మాత్రం స్థానిక నేతల ప్రమేయం ఉందని గులాబీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పాలక మండలి , సలహా మండళ్లలో తమ అనుచరులకు అవకాశం కల్పించకపోవడంపై జిల్లాలోని మరికొందరు ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు.

3 జిల్లాల 19 మండలాలు 181 గ్రామాల్లో కూడా విస్తరించిన కీలకమైన కమిటీలో కొందరు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లనే పరిగణలోకి తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది . లే అవుట్ లు , భూ లావాదేవీలు , భవన నిర్మాణాల విషయంలో కూడా అనుమతులు తప్పని సరి . కానీ నిధుల కేటాయింపు కమిటీల్లో మాత్రం హుస్నాబాద్ , హుజూరాబాద్ నియోజకవర్గాలకూ అగ్రపీఠం వేస్తున్నారంటూ మిగతా ప్రాంత ప్రజా ప్రతి నిధులు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . 15 మందితో కూడిన సలహా మండలి కమిటీలో వరంగల్ ట్రైసిటీకి సంబంధించిన ఉద్యమకారులు , సీనియర్ లకు అవకాశం దక్కలేదని కొందరు బాహాటంగానే చెబుతున్నారు.

నిజానికి కూడా పాలక వర్గం సలహా మండలిని నియమించేటప్పుడు ఆ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు మంత్రి ఇతర సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు . ఈసారి కూడ అది జరిగి ఉంటుందని అందరూ భావించారు . అయితే కమిటీల విషయంలో టీఆర్ఎస్ లోనే నెమ్మదిగా అసంతృప్తి రాక మొదలైంది. పాలక వర్గంలో 10 మందికి అవకాశం కల్పించారు. మర్రి యాదవరెడ్డి చైర్మన్ గా , మున్సిపల్ కమిషనర్ వైస్ ఛైర్మన్ గా వరంగల్ తూర్పు , పశ్చిమ , వర్ధన్నపేట , పరకాల , స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ , నన్నపునేని నరేందర్ , ఆరూరి రమేష్ , చల్లా ధర్మారెడ్డి , డాక్టర్ టి రాజయ్యలతో పాటు మరో 3 అధికారులను సభ్యులుగా చేర్చారు . ఇదే సమయంలో వరంగల్ అర్బన్ జిల్లాలో అసలు మేము ఉన్నామా లేమా అన్న అనుమానం కలుగుతోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం . ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన సభలో సతీష్ కుమారు ఈ మాటలు అన్నారు.

ఆయన మాటలు ఇప్పుడు ఉమ్మడి ఓరుగల్లులో ప్రకంపనలు రేపుతున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు సీనియర్ లలోనూ ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఏదేమైనా కూడా నూతన చైర్మన్ కమిటీల నియామకం అంశం అధికార పక్షంలో కొత్త చిచ్చురేపిన మాట నిజం. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఇతర పార్టీల నుంచి గులాబీదళంలో భారీగా వలసలు జరిగాయి. అధిక సంఖ్యలో ద్వితీయ శ్రేణి నేతలు ఆ పార్టీలో చేరారు. ఆశవహులు భారీ సంఖ్యలో ఉండటంతో ఎవరిని ఎలా బుజ్జగించాలో తెలీక పార్టీ సీనియర్ లు తలలు పట్టుకుంటున్నారు . ఉమ్మడి ఓరుగల్లులో రగులుతున్న ఈ వ్యవహారం ఎలా చల్లారుతుందో చూడాలి …