విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కుమార్తె వివాహ సమయంలో తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడడం సంచలనంగా మారింది. భర్తే, భార్యను హత్యచేసి, అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే: విశాఖపోర్టు రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు, వీరికి ఒక కుమార్తె. ఇటీవలే వీరి కుమార్తెకు పెళ్లి కుదిరింది. గురువారం సాయంత్రం పెళ్లి జరుగుతుండగా భార్యా భర్తలిద్దరూ ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానం సమయంలో వారు కనిపించలేదు. బంధువులు, కుటుంబ సభ్యులు చుట్టూ వెతికినా ఎక్కడా కనిపించకపోయేసరికి బంధువులు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో విగతజీవులుగా పడిఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నదని, తరచూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేదని పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు తొలుత ఆమెను చంపి, ఆ తర్వాత తానుకూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనను అత్తారింటికి పంపాల్సిన తల్లిదండ్రులు ఇలా విగతజీవులుగా పడి ఉండటంతో వధువు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.