నా పేరు కరోనా బాబా, నాకు అతీత శక్తులున్నాయి, మాయలు మంత్రాలతో ‘కరోనా’ రాకుండా చేస్తా, మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ అమాయక ప్రజలు నమ్మేలా తన శిష్యులతో ప్రచారం చేయించాడు. మోసపూరిత మాటలను నమ్మి ఆయన వద్దకు వచ్చిన అమాయకుల నుంచి వేలాది రూపాయలు దండుకున్నాడు. కరోనా బాబాను మియాపూర్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మియాపూర్‌ న్యూ హఫీజ్‌పేట్‌లోని హనీఫ్‌కాలనీకి చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ అలియాస్‌ కరోనా బాబా కొన్ని సంవత్సరాలుగా కాలనీలోని దర్గా వద్ద కూర్చొని ప్రజలకు మంత్రాలు వేస్తూ… తాయత్తులు కడుతుండేవాడు.

దగ్గు, జలుబు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వచ్చిందని తన శిష్యులతో ప్రచారం చేసి తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. అతని వద్దకు వచ్చిన అమాయకులను కోవిడ్‌–19 బూచిగా చూసి భయభ్రాంతులకు గురిచేçస్తూ వ్యాధి నయం చేస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో అతని మాయమాటలు నమ్మిన జనం శుక్రవారం రాత్రి 30 మంది వరకు వచ్చారు. చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు మెహిదీపట్నం, బోరబండ తదితర ప్రాంతల నుంచి కూడా వచ్చారు. బాబా ఉన్న ప్రాంతంలో జనం ఎక్కువగా గుమిగూడటంతో స్థానికులు మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. అతనిపై సుమోటో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.