ఓ దొంగ రైల్వే స్టేషన్‌ నుంచి కదులుతున్న రైలులో మొబైల్‌ ఫోన్‌ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్‌ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్‌ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్‌ కమల్‌ స్టేషన్‌ దగ్గరకు రాగానే దొంగ మొబైల్‌ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్‌ బెడిసి కొట్టింది. మొబైల్‌ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్‌ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు.

అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్‌ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.