చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నిర్దయగా వదిలేసిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన బలిజ శివశంకరయ్య (80) హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కాలుకు పుండు కావడంతో ఆ ప్రదేశం కుళ్లిపోయింది.

వార్డులోని మిగిలిన రోగులు ఆయన స్థితిని చూసి అక్కడ ఉండలేకపోవడంతో ముస్లిం నగారా ట్రస్టు వ్యవస్థాపకుడు ఉమర్‌ఫరూఖ్, సభ్యులు రోజూ స్నానం చేయించి దుస్తులు మార్చి సపర్యలు చేస్తున్నారు. అతని ద్వారా వివరాలు సేకరించి వన్‌టౌన్‌ ఎస్‌ఐ బాలమద్దిలేటికి సమాచారమిచ్చారు. అతని వద్ద ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా వైఎస్సార్‌ జిల్లాలోని చెనిక్కాయలపల్లి రామాపురం చిట్లూరు వాసిగా గుర్తించారు.

కుమారుడు నాగేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఉమర్‌ఫరూక్‌ ట్రస్ట్‌ సభ్యులు, సీఐ అతన్ని ఫోన్‌లో సంప్రదించగా ‘నాకు నాన్న అవసరం లేదు. నన్ను ఆయన సాకలేదు. నేనేమీ ఆయన ఆస్తులు తీసుకొని బయటకు గెంటేయలేదు. ఆయన ఎక్కడకు పోయాడో కూడా తెలియదు. ఇప్పుడు నాకు ఆయన్ను చూడటం కష్టం. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి’ అని సమాధానం ఇచ్చాడు. కుమారుని ప్రవర్తనతో కలత చెందిన శివశంకరయ్య కేసు పెట్టేందుకు సిద్ధమని సీఐతో చెప్పడం గమనార్హం. జీవిత చరమాంకంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వృద్ధుడిని చూసి స్థానికుల మనసు ద్రవిస్తోంది.