మద్యం మత్తులో కన్నతల్లినే రేప్ చేయబోయిన కొడుకుని తల్లి కళ్ళలో కారంకొట్టి ఉరితీసి చంపేసింది. కొడుకు మద్యానికి బానిసయ్యాడు. పని మానేశాడు. భార్యాపిల్లలను వదిలేశాడు. తల్లిని కొట్టేవాడు. అయినా భరించింది. అతడు మృగంలా మారాడు. కన్నతల్లినే చెరపట్టాలని చూశాడు. అంతే… ఆ అమ్మ అపర కాళికైంది. అతని జీవితానికి మరణ శాసనం రాసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన యువకుడికి (30) ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసై, రోజూ హింసిస్తుండటంతో భార్య తన ఇద్దరు బిడ్డలను తీసుకుని నాలుగేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది.

నాటి నుంచి అతని పోషణను తల్లే చూసుకుంటోంది. తాగడానికి డబ్బులివ్వాలని తరచూ కొడుతున్నా తల్లి సహించేది. ఇటీవల తీవ్రంగా కొట్టడంతో బంధువుల ఇంటికి వెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా తన బిడ్డ తిండికి ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుని తిరిగొచ్చింది. సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై మద్యం మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు అఘాయిత్యం చేయబోయాడు. మొదట హతాశురాలైనా, వెంటనే తేరుకుని ప్రతిఘటించింది. కళ్లలో కారం కొట్టింది. చేతికి అందిన కావిడి తాడును అతని మెడకు బిగించి చంపేసింది. తాను ఎదుర్కొన్న క్షోభను డీఎస్పీ, గ్రామీణ సీఐలకు ఏడుస్తూ వివరిస్తున్న ఆమెను చూసి, స్థానికులూ కంటతడి పెట్టారు.