వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని లైఫ్‌లైన్ హాస్పటల్‌లో బాలింత చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అందరిని కలిచివేసింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిడ్డను చూడకముందే కన్నుమూసిన తల్లిని చూసిన వారందరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వివరాలు: కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన సునీతకు పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త రమేష్ కాజీపేటలోని ప్రసాద్ ఆస్పత్రిలో నాలుగు రోజుల కింద తీసుకువచ్చారు. ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన క్షణానికే అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు కిరణ్మయి ప్రసాద్ హాస్పటల్ నుండి లైఫ్‌లైన్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రెండోసారి ఆపరేషన్ చేశారు. మళ్లీ సుమారు 45 బాటిళ్ల రక్తం, 5 ప్యాకెట్ల రక్తకణాలను ఎక్కించారు. సోమవారం చికిత్స పొందుతూ సునీత చనిపోయింది. రెండోసారి ఆపరేషన్ చేయడం, సరిగా కుట్లు వేయకపోవడంతో చనిపోయిందని బంధువులు ఆరోపించారు.

వైద్యుల నిర్లక్ష్యమే అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ హాస్పటల్‌లో ఆందోళనకు దిగారు. ఎన్నో ఆశలతో వచ్చిన తల్లి బిడ్డను చూడకుండానే కన్ను మూసిందని బంధువుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లయి సంవత్సరమవుతుందని విలపించారు. తల్లి పాలు తాగాల్సిన బిడ్డ ఆస్పత్రిలో డబ్బా పాలు తాగడం చూసిన అక్కడ ఉన్న వారు కన్నీరు పెట్టుకున్నారు.

మంచిగానే ఉందని రిపోర్ట్ నార్మల్‌గానే వచ్చాయని చెప్పి చివరికి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారని ఆస్పత్రిలో బంధువుల అర్తనాదాలతో రోధనలు మిన్నంటాయి. సంవత్సరం కూడా కాకముందే కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గతంలో కూడా సదరు వైద్యురాలు ఆపరేషన్ చేయడం వల్ల చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయని వారు ఆరోపించారు. జరిగిన సంఘటనపై హాస్పటల్ యాజమాన్యం మీడియాకు వివరాలు చెప్పడానికి నిరాకరించారు. ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.