చెన్నై: విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌, నటి పూజా కుమార్‌ డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్‌’, ‘విశ్వరూపం 2’లో నటించారు. కమల్‌తోనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతోనూ పూజా కుమార్‌ స్నేహంగా ఉంటున్నారు. కమల్‌ ఫ్యామిలీ వేడుకల్లో పూజా కుమార్‌ కూడా పలుమార్లు కనిపించారు. అయితే డేటింగ్‌ వదంతులపై పూజా కుమార్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘చాలా ఏళ్లుగా నాకు కమల్‌, ఆయన కుటుంబం తెలుసు. ఆయనతో కలిసి నటించినప్పటి నుంచి కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యా. ఆయన సోదరుడు, ఇద్దరు కుమార్తెలు శ్రుతిహాసన్‌, అక్షరా హాసన్‌.. అందరూ నాకు సుపరిచితమే. అందుకే వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్‌లలో నేను కనిపిస్తుంటా’ అని ఆమె సమాధానం ఇచ్చారు.

కమల్‌ తదుపరి సినిమా ‘తలైవన్‌ ఇరుక్కిరన్‌’లో పూజా కుమార్‌ నటిస్తున్నారని వచ్చిన వార్తల్ని కూడా ఆమె ఖండించారు. ‘నేను ఆ ప్రాజెక్టులో నటించడం లేదు. ఇప్పటి వరకైతే అలాంటిదేమీ లేదు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’ అని పేర్కొన్నారు. పూజా కుమార్‌ తెలుగులో నేరుగా నటించిన సినిమా ‘గరుడవేగ’. ఇందులో ఆమె కథానాయకుడు రాజశేఖర్‌ భార్యగా కనిపించారు. కమల్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, ప్రియా భవాని కీలక పాత్రలు పోషిస్తున్నారు.