హైదరాబాద్: అధికార టిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. ఎంఎల్‌సి ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా డబ్బులు ఖర్చు చేయనుందని, ఓటుకు రూ.10 లక్షలు ఇస్తోందంటూ ఆయన ఆరోపించారు. అయితే ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు టిఆర్‌ఎస్ ఇచ్చే రూ.10 లక్షలు తీసుకోవాలని, ఓటు మాత్రం ఒక్క రూపాయి ఇచ్చే తనకే వేయాలని కోరాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రవీందర్‌సింగ్‌పై కేసు నమోదయ్యింది._

కరీంనగర్‌ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లను ఇతర పార్టీల వద్ద డబ్బులు తీసుకుని తనకు ఓటు వేయాలని రవీందర్ సింగ్ మీడియా సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ఇలా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను వారి పార్టీల వద్ద రూ.10 లక్షలు తీసుకొని తనకు ఓటు వేయాలని కోరడంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి.