కరోనా కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. వృద్ధుడు చనిపోతే బంధువులు చివరి చూపునకు కూడా రాని పరిస్థితి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు గత వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతూ శుక్రవారం రాత్రి ఇంటి వద్దే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతి చెందిన విషయాన్ని వారు బంధువులకు ఫోన్‌ చేసి చెప్పారు. శనివారం విషయం ఊరంతా తెలిసింది. కానీ అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వారు మృతదేహాన్ని ట్రాక్టర్‌ ట్రాక్‌లో తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. తహసీల్దారు షాకిరున్నీసాబేగం, ఎంపీడీవో రాజు పర్యవేక్షించారు.