డిగ్రీ , పిజి ఫైనలియర్ పరీక్షలు జరపకుండా ఎవరినీ పాస్ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. పరీక్షలు రద్దుపై దాఖలైన పిటిషన్ శుక్రవారం కొట్టేసింది. పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్‌ చేయవద్దని కోర్టు సూచించింది. సెప్టెంబర్ 30న యథాతథంగా యూజీసీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. యూజీసీ గైడ్‌లైన్స్‌ని‌ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫైనలియర్‌ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాల్సిందిగా ఆదిత్య ఠాక్రేకు చెందిన యువసేనతో సహ పలు సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.

కరోనా వైరస్‌ కారణంగా విద్యాసంస్థలు మూసి వేశారని, ఇలాంటి పరిస్థితులోల​ పరీక్షలు పెడితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పిటిషన్‌దారులు కోర్టుకు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్‌దారులు కోర్టును కోరారు. ఇప్పటికే విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని, వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలన్నారు. ఈ పిటిషన్లను నేడు విచారించిన సుప్రీం కోర్టు యూజీసీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్‌ చేయడాన్ని ప్రోత్సాహింవద్దని కోర్టు రాష్ట్రాలను కోరింది.