కరోన మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్‌ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడు వారాల పాటు దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 120 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9 లక్షల కోట్లు) మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ఇది భారత జీడీపీలో 4 శాతానికి సమానమని పేర్కొంది. మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల నష్టమే 90 బిలియన్‌ డాలర్లు ఉంటుందని, దీనికి అంతకుముందే పలు రాష్ట్రాల్లో లౌక్‌డౌన్‌ ప్రభావం అదనమని వివరించింది. కాగా, దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ నిర్ణయం బుధవారం ఈక్విటీ మార్కెట్లను ఏ మాత్రం ప్రభావితం చేయకపోవడం గమనార్హం.