హైదరాబాద్‌‌: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి దంపతుల జీవితాలు విషాదంగా ముగిశాయి. కరోనా మహమ్మారి భర్తను కబళించగా, భర్త మరణాన్ని తట్టులేక భార్య బంగ్లా (మూడంతస్తుల)పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి కథనం ప్రకారం: నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు వెంకటేష్‌ (56), తడకమల్ల ధనలక్ష్మి(55)లు నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని అంబేడ్కర్‌ నగర్‌లోని ఓ బిల్డింగ్‌లో అద్దెకుంటున్నారు. భార్య ధనలక్ష్మి ఏఎస్‌ రావునగర్‌లోని సూపర్‌ మార్కెట్‌లో హెల్ఫర్‌గా, భర్త కన్‌స్ట్రక్షన్‌ సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. వీరికి సంతానం లేదు. కొన్ని రోజుల క్రితం భర్తకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.

అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. భార్య యథావిధిగా గురువారం పనికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న భర్త మృతి చెంది ఉన్నాడు. పిల్లలు లేరు భర్త మరణించడంతో తట్టులేక మనస్తాపంతో భార్య మూడంతస్తుల బంగ్లాపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికల ద్వారా సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.