వనస్థలిపురం: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. అయితే, కరోనాతో చనిపోయిందని చెప్పి భర్త అంత్యక్రియలు నిర్వహించగా, వారం రోజుల తర్వాత కరోనా రాలేదని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన వనస్థలిపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం: నల్గొండ జిల్లా పిల్లిగుంట్ల తండాకు చెందిన రమావత్‌ విజయ్‌కుమార్‌, కవిత దంపతులు బీఎన్‌రెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 18న కవిత కరోనాతో చనిపోయిందని ఆమె భర్త విజయ్‌కుమార్‌ ఇంజాపూర్‌ సుందరయ్య కాలనీలో నివాసముండే ఆమె తల్లిదండ్రుల వద్దకు మృతదేహాన్ని తీసుకునివెళ్లాడు. స్వగ్రామమైన పిల్లిగుంట్ల తండాలో మరుసటిరోజు అంత్యక్రియలు నిర్వహించారు.

మృతదేహాన్ని తాకినవారు, గుంపులుగా వచ్చినవారెవరికీ కరోనా రాకపోవడంతో అనుమానం వచ్చిన మృతిరాలి తల్లిదండ్రులు బీఎన్‌రెడ్డినగర్‌లో విచారించారు. కవితకు జ్వరం రాగా చూపించిన దవాఖాన రిపోర్టులను పరిశీలించగా అందులో నెగిటివ్‌ అని తెలిసింది. దీంతో ఈ నెల 24న వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 26న పిల్లిగుంట్ల తండాకు వెళ్లి తహసీల్దార్‌తో పంచనామా చేయించారు. పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. కవిత మృతిపై భర్త విజయ్‌కుమార్‌పై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.