ఆమె కరోనాను జయించింది, సంతోషంగా ఇంటికి చేరింది. ఆస్పత్రిలో నిద్రలు లేని రాత్రులు గడపడంతో, సొంతింటిలో కంటి నిండా నిద్ర పోదామనుకుంది, కానీ రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ? ఆమెను కుమారుడు, కోడలు ఇంట్లోకి రానివ్వలేదు. ఈ అమానవీయ ఘటన ఫిలింనగర్‌లోని బీజేఆర్‌ నగర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బీజేఆర్‌ నగర్‌కు చెందిన ఓ మహిళ(55)కు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆమె గత కొద్ది రోజుల నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. శుక్రవారం ఉదయం ఆమెకు కరోనా నెగిటివ్‌ అని ఫలితం వచ్చింది. ఈ క్రమంలో సాయంత్రం ఆమెను డిశ్చార్జి చేసి ఇంటికి పంపించేశారు. కానీ ఇంటి వద్ద ఆ తల్లికి అవమానం ఎదురైంది.

ఇంట్లోకి ఆమెను కుమారుడు, కోడలు రానివ్వలేదు. ఇంటి పైకప్పు రేకులను తొలగించి ఇంటికి తాళం వేసి అక్కడ్నుంచి కొడుకు, కోడలు వెళ్లిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి, నడిరోడ్డుపై రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. కొడుకు, కోడలిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కన్నీరు పెట్టుకుంది. పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించలేదు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు అధికారులను కోరింది.