కరోనా.. అనగానే ప్రపంచమంతా చైనా వైపు చూసింది. ఆ చైనా ఎవరివైపు చూసిందో తెలుసా..! ఓ మహిళ వైపు..! కరోనాతో వుహాన్‌ నగరం ఉలిక్కిపడ్డ వేళ, చైనాలోని అధికారులంతా ఆమె ఫోన్‌ నంబరు కోసమే వెతికారు. ఆమె పేరు… షి-జెంగ్లీ. షాంఘైలోని ఓ సదస్సులో షి-జెంగ్లీ మాట్లాడుతోంది. ఇంతలో ఆమె ఫోన్‌ మోగింది. అది చైనాలోని ఓ ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఫోన్‌. రెండు నిమిషాలు మాట్లాడింది. ఆమె ముఖ కవళికలు మారాయి. వెంటనే ఆమె వుహాన్‌ నగరం వెళ్లే రైలు ఎక్కింది.

కరోనా, ఈ పేరు చెప్పగానే ప్రపంచం భయపడుతోంది. .దేశదేశాలే అల్లాడిపోతున్నాయి. అసలీ కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? మూలాలు ఏమిటి? అని చాలా మంది శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు.అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగల అతి కొద్దిమంది శాస్త్రవేత్తల్లో షి- జెంగ్లీ ఒకరు. సన్నిహితులు ముద్దుగా ‘బ్యాట్‌ ఉమన్‌’, గబ్బిలం మహిళ అని ఈమెను పిలుస్తారు. అందుకే వుహాన్‌ నగరంలో మొదటిసారి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించగానే ఈ బ్యాట్‌ ఉమన్‌కే కబురు వెళ్లింది. పదహారేళ్ల నుంచి షి-జెంగ్లీ కరోనా వైరస్‌లపై విస్తృతంగా పరిశోధనలు చేస్తుంది.

ఇందుకోసం ఆమె చైనాలోని చీకటి చొరబడని గుహల్లో రోజుల తరబడి గడిపింది. కరోనాకి గుహలకు సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఉన్నాయంటోంది జెంగ్లీ, ఆ సంబంధమే గబ్బిలాలు. తన పరిశోధనలో భాగంగా ఆమె ఎన్నో గబ్బిలాల రక్త నమూనాలను సేకరించింది. వాటిపై ఎన్నో పరీక్షలు నిర్వహించింది. ఎంతో కష్టపడి వాటి జన్యుపటాలను రూపొందించింది. వాటి ఆధారంగా ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్‌-19 మాత్రమే కాదు, ఇంతకుముందు చాలా దేశాలను అల్లాడించిన సార్స్‌, ఎబోలాల వెనక కూడా కరోనా వైరసే ఉందని, వాటి వ్యాప్తికి గబ్బిలాలే కారణమని షి- జెంగ్లీ నిర్ధారించింది.

గబ్బిలాల గుహల్లో..!

2003లో సార్స్‌ ప్రపంచాన్ని వణికించింది. ఆ వైరస్‌ సోకిన వాళ్లలో దాదాపు పదిశాతం మంది చనిపోయారు ఆ సమయంలోనే ఈ వైరస్‌ అంతు తేల్చాలని శాస్త్రవేత్తలు భావించారు. సార్స్‌ మూలాల వేట ప్రారంభించారు. అదే సమయంలో అంటే 2004లో షి-జెంగ్లీ కూడా ఈ వేటలో పాల్గొంది. తోటి శాస్త్రవేత్తలతో కలిసి చైనాలోని వివిధ నగరాల్లోని గుహల్లో పరిశోధనలు చేసింది. చివరకు ఆమె ప్రయత్నాలు యునాన్‌ నగరంలోని గుహల్లో ఫలించాయి. అక్కడి గుహల్లోని గబ్బిలాల్లో సార్స్‌ మూలాలని కనుక్కుంది. ఈ గబ్బిలాల నుంచే సార్స్‌ వ్యాపించిందని నిర్ధారణకు వచ్చింది. గబ్బిలాల నుంచి కరోనా వైరస్‌లు ఇతర జంతువులకు వ్యాపిస్తున్నాయని ఆమె పరిశోధనల్లో కనుక్కుంది.

మాంసాహారమే కారణమా..!

చైనీయులు ఎక్కువగా జంతు మాంసాన్ని తింటారు. ఈ ఆహార లక్షణాలే.. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమంటోంది షీ జెంగ్లీ. వీటిపై ఆమె తయారుచేసిన పరిశోధన పత్రాలను ప్రపంచంలోని ప్రముఖ జర్నల్స్‌ ప్రచురించాయి. వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించగానే షి జెంగ్లీ.. వుహాన్‌లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు చేరుకుంది. అక్కడి ప్రయోగశాలలో రోగుల రక్తనమూనాలు పరిశీలించింది. వెంటనే ఆమెకు అర్థమైపోయింది ఇది కరోనా వైరసని. పాత నివేదికలను తెప్పించింది. సార్స్‌ వైరస్‌ జన్యుపటంతో ఈ కొత్త వైరస్‌ను పోల్చింది. దాదాపు సమానంగా ఉందని ఆమె పరిశీలనలో తేలింది. అయితే ఈ కొత్త వైరస్‌.. సార్స్‌ను మించి ప్రమాదకరమని గ్రహించింది. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఆమె సూచనలతోనే జంతువుల అమ్మకాలు, కొనుగోళ్లపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.