కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా టీకా తీసుకున్న ఇద్దరు అంగన్వాడీ సహాయ కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. ముందుగా శ్రీలత అనే మహిళ టీకా తీసుకున్న అనంతరం అరగంట అబ్జర్వేషన్ లో ఉంది. ఈ క్రమంలో మరో అంగన్వాడీ సహాయ కార్యకర్త లక్ష్మీ టీకా తీసుకుంది. లక్ష్మీ భయంతో కొంత అస్వస్థతకు గురవడంతో లక్ష్మీని చూసి శ్రీలత అస్వస్థతకు గురయింది. దీంతో శ్రీలతను మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీకి ఇదే కేంద్రంలో చికిత్స అందించడంతో కాసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని, శ్రీలతకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆనంద్ పేర్కొన్నారు. శ్రీలత ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.